Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 58

Story of Trisanku !!

|| om tat sat ||

తతః త్రిశంకోర్వచనం శ్రుత్వా క్రోథ సమన్వితమ్ |
ఋషిపుత్ర శతం రామ రాజానం ఇదం అబ్రవీత్ ||

తా|| ఓ రామా! అప్పుడు ఆ వందమంది ఋషి పుత్రులు త్రిశంకుని మాటలను విని క్రోధముతో కూడినవారై ఇట్లు పలికితిరి

బాలకాండ
ఎబది ఎనిమిదవ సర్గము
త్రిశంకుని కథ

శతానందుడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అగు కథను చెప్పసాగెను.

" ఓ రామా! అప్పుడు ఆ వందమంది ఋషి పుత్రులు త్రిశంకుని మాటలను విని క్రోధముతో కూడినవారై ఇట్లు పలికితిరి. "ఓ దుర్బుద్ధీ ! సత్యమునే పలుకు గురువగు వసిష్ఠుని చేత తిరస్కరించబడిన నీవు, మేము ఎట్లు మాశాఖను దాటగలమనుకొంటివి. ఇక్ష్వాకు లందరికి సత్యము పలుకు పురోహితుడే పరమ గురువు. ఆ సత్యవాదిని మాట దాటటం అశక్యమైన పని . భగవాన్ ఋషి వసిష్ఠుడు నీ కోరికను అశక్యమని చెప్పినాడు. ( అప్పుడు) నీ క్రతువును చేయుటకు మాకు ఏట్లు శక్తి కలుగును. ఓ నరశ్రేష్ఠా ! నీవు మూర్ఖుడవు. నీ పురమునకు వెళ్ళిపొమ్ము. ఓ రాజా ! ఆ మహాముని యజనము చేయించుటకు ముల్లోకములలో శక్తి కలవాడు. దానిని (నీ కోరికతీరు యజ్ఞమును) మేము చేయుట అ మహామునిని అవమానము చేసినట్లు. అట్టిపని ఎట్లు చేయగలము !" అని.

క్రోధావేశములతో పలికిన వారి మాటలను విని ఆ రాజు మళ్ళీ ఈ వచనములను పలికెను. "ఓ తపోధనులారా ! గురువు చేతనూ అలాగే గురుపుత్రులచేతనూ నేను తిరస్కరింపబడితిని. ఇంకో మార్గము చూచుటకు పోయెదను. మీకు శుభమగుగాక".

అట్లు తమని తిరస్కరించుచూ పలికిన ఘోరమైన వచనములను విని ఋషిపుత్రులు పరమ క్రోధముతో "నీవు చండాలత్వము పొందెదవు గాక" అని శపించితిరి . ఆ ఋషి పుత్రులు ఆ విథముగా చెప్పి తమ ఆశ్రమము నకు పోయిరి.

’ పిమ్మట రాత్రి గడిచినంతనే త్రిశంకుడు చండాలత్వము పొందెను. నల్లని వస్త్రములు కలవాడాయెను. నల్లని రంగు కలవాడాయెను. కఱకు దనము కలవాడాయెను, చిన్న వెంట్రుకలు కలవాడాయెను. చితి మాలలూ శ్మశాన బూడిద కలవాడాయెను. అతని ఆభరణములు ఇనుముతో చెసినవి అయ్యెను. ఓ రామా ! అ చండాలరుపముగల త్రిశంకునిని చూచి మంత్రులందరూ పారిపోయిరి. పౌరులు వారిని అనుసరించితిరి.

ఓ కకుత్‍స్థ ! ఆ రాజు ఒంటరివాడై రాత్రి పగలు దుఃఖముతో మండి పోవుచున్ననూ ధైర్యముతో తపోధనుడు అగు విశ్వామిత్రుని వద్దకు వెళ్ళెను. ఆ అసఫలుడైన చండాలరూపము పొందిన రాజుని చూచి విశ్వామిత్ర ముని కి కరుణ కలిగెను. ఆ కరుణతో పరమధార్మికుడు మహాతేజోవంతుడు అయిన విశ్వామిత్రుడు ఆ ఘోరరూపముగల రాజు తో ఇట్లనెను. "ఓ మహాబల ! నీవు వచ్చిన పని ఏమి ? ఓ రాజపుత్ర ! ఓ అయోధ్యాధిపతి ! ఓ వీరా శాపముతో నీకు చండాలగతి ఎవరివలన పట్టినది. "

అప్పుడు ఆ మాటలను విని ఆ రాజు వాక్యజ్ఞుడు వాక్యకోవిదుడు అయిన రాజర్షికి అంజలిఘటించి చండాలత్వము పొందిన కారణము ఇట్లు చెప్పెను. "గురువు చేత అలాగే గురుపుత్రులచేత తిరస్కరింపబడినవాడిని అయితిని. నాకోరిక పొందనప్పటికీ నాకు శాపము కలిగినది. ఓ సౌమ్యుడా ! శరీరముతో దేవలోకము పోవుటకు అని నేను వంద క్రతువులు చేసితిని. వాని ఫలముకూడా నాకు దక్కలేదు.
ఓ సౌమ్య ! నా క్షత్ర ధర్మముపై నీకు ప్రమాణము చేసి చెప్పుచున్నాను. నేను పూర్వము అబద్దము ఎంత కష్టమైననూ చెప్పలేదు. నేను ఎప్పుడూ చెప్పను కూడా. అనేక యజ్హ్జములను చేసితిని. ధర్మముగా ప్రజలను పాలించితిని. మహాత్ములగు గురువులచే నా శీలవృత్తి అభినందించబడినది".

"ధర్మమార్గములో పోవుచూ ఈ యజ్ఞము చేయ కోరుచున్నాను. గురువు అయిన మునిపుంగవులు దానికి సంతోషము వ్యక్తపరచలేదు.
దేముడు తప్ప ఇంకో మార్గము లేదు. పౌరుషబలము నిరర్థకము. దేముడే అన్నిటికి అధిపతి. దైవమే పరమాగతి . మిక్కిలి ఆర్తుడనగు నాకు దైవము అనుకూలమగునట్లు చేయగల కర్మ నీ వు చేయగలవు. నీకు శుభమగుగాక . నాకు అన్యమైన గతి లేదు. నాకు ఇంకొకరి శరణు లేదు. పురుషకార్యముతో దైవమును అనుకూలముగా మీరే చేయగలరు".

|| ఈ విథముగా వాల్మీకి ఆదికావ్యమైన శ్రీమద్రామాయణములో బాలకాండలో ఎబది ఎనినిదవ సర్గ సమాప్తము ||

|| ఓమ్ తత్ సత్ ||

నాన్యాం గతిం గమిష్యామి నాన్యశ్శరణమస్తి మే|
దైవం పురుషకారేణ నివర్తయితుమర్హసి ||

నాకు అన్యమైన గతి లేదు | నకు ఇంకొకరి శరణు లేదు. పురుషకార్యముతో దైవమును అనుకూలముగా మిరే చేయగలరు.

|| om tat sat ||